Thursday, July 16, 2015

నేను హిందువుని

నేను హిందువుని అని చెప్పుకోవడానికి అందరు గర్వపడతారు గానీ , ఆ గర్వం మనకు ఎందుకో కూడా తెలియాలి కదా ..?
హిందువుని అని చెప్పుకుని తిరిగేవారు విర్రవీగే వారు ఆ హిందూమతము లోని లోటుపాట్లు కూడా తెలుసుకోవాలి కదా ...?
హిందూమతములో ఇప్పుడు చెప్పుకునే కుల వ్యవస్థ ఎప్పుడు మొదలయ్యింది ? దానికి బాధ్యులు ఎవరు ? మన వేదాలలో గీతలో కుల వ్యవస్థ గురించి ఎక్కడైనా చెప్పారా ? ఇప్పుడు కులాల కుంపట్లో హిందూ / సనాతన జాతి నాశనం అయిపోతుంటే ఈ విర్రవీగే వాళ్లకు చీమైనా కుట్టినట్టు ఉందా ?
మనకు గీతలో చెప్పింది వర్ణ వ్యవస్థ కదా ...! చాతుర్ వర్ణం మయా సృష్టం అని కదా గీతా చార్యుడు మనకు చెప్పింది ., అసలు వర్ణం అంటే ఏమిటి ? వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా మార్చింది ఎవరు ? కుల వ్యవస్థని పెంచి పోషించి నూటికి 90 మందిని అంటరాని వారిగా సమాజానికి దూరంగా పెట్టింది ఎవరు ? మనకు ఆదిశంకరుల వారు అంటరానితనాన్ని ఉద్భోదించారా ? ఆయన చండాలుని కాళ్ళు పాట్టుకున్నారని మనము చదువుతామే, మరి ఆ చండాలుర కులస్థులను గ్రామాలకు దూరంగా పెట్టి వాళ్ళను సంఘ బహిష్క్రుతులుగా చేసింది ఎవరు ? కారకులు ఎవరు ? దళితుల్ని వెనుకబడిన వర్గాలను దేవాలయాలలోకి రాకుండా ఆపింది ఎవరు ? శూద్రులను కేవలం ఉత్పాదక శక్తులుగా మాత్రమె గుర్తించి ఆ ఉత్పాదన కోసమే వాళ్ళను గౌరవించి వాళ్ళను మాత్రం దేవాలయాలలో ధ్వజ స్థంభం దగ్గరకు మాత్రమె రానిచ్చింది ఎవరు ? అదే దళితులను దేవాలయాల ప్రాకారాల బయటే ఉంచింది ఎవరు ? మన వేదాలా ? మన శాస్త్రాలా ? మన సనాతన ధర్మమా ? మన భగవద్గీతా ? మన రామాయణ భారతాలా ? భాగవత పురాణాలా ?
అనాదిగా మన హిందూ పీఠాధిపతులు స్వాములు పండితులు ఎవరు ? వాళ్ళు చేసింది ఏమిటి ? ఒక్క కంచి పరమాచార్య తప్పించి మిగతా వాళ్ళు ఎవరన్నా దళితుల్ని నిమ్న వర్గాలను మనుషులుగా చూసారా ? ఎవరన్నా మన పేద సమాజానికి పనికి వచ్చే విధంగా ఉచిత ఆసుపత్రులు పాఠశాలలు నిర్మించారా ? వేల లక్షల కోట్ల రూపాయిలు ఈ పీఠాధిపతులు స్వామీజీలు ఎక్కడ దాచారు ? ఎవరి దగ్గర దాస్తున్నారు ? మన మతం గురించి అనీ వదిలేసి కాషాయం కట్టిన వాళ్లకు బంగారు సింహాసనాలు బంగారు మంచాలు కంచాలు బంగారు పాదుకలు గండపెండేరాలు అవసరమా ? బెంజి కార్లు ప్రత్యెక విమానాలు అవసరమా ? వీళ్ళందరూ మతోద్దారకులం అని చెప్పుకుంటూ విలాసవంతమైన జీవితాలు అనుభవించడం నిజం కాదా ? వీళ్ళందరూ ఏ వర్గానికి చెందినా వారు ? వీళ్ళను, వీళ్ళు చేసే అసాంఘిక కార్యకలాపాలను శ్రీ కంచె అయిలయ్య కాకపొతే ఇంకొకరు ప్రశ్నిస్తారు, ప్రశ్నించ కూడదా ? ప్రశ్నించిన వాళ్ళు అందరు మత ద్రోహులేనా ? మనం వాళ్ళ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక, మన మతములో ఉన్న కుళ్ళును ప్రశ్నించే వాళ్ళను చూసి ఓర్వలేక వాళ్ళ అనుమానాలు నివృత్తి చెయ్యలేక వాళ్లకు శాపనార్ధాలు పెడుతూ ఎన్నాళ్ళు మనం మన అంతరాత్మకు ముసుగులు వేసుకుని బ్రతుకుదాం ? అమాయకుల్ని మతం పేరుతొ పాపం పుణ్యం స్వర్గం నరకం అనే పేరుతొ భయపెట్టి ఎన్నాళ్ళు ఇలా దొంగ బ్రతుకులు వెళ్ళ దీద్దాం ? దొంగ పూజలతో ఎన్నాళ్ళు దోపిడీకి గురవుదాం ? అభిషేకాలు సేవలు పేరుతొ నిత్యమూ ఎన్ని లీటర్ల పాలు పండ్ల రసాలు మురికి కాలువల పాలు చేద్దాం ? వాటిని నిరుపేదలకు అనాధ పిల్లలకు వయో వృద్ధులకు ఇస్తే శక్తివంతమైన దేశం అవుతుంది కదా ? ఏ దేవుడు ఎక్కడ చెప్పాడు ఇలా అభిషేకాలు చేసి పాలు పళ్ళు మురికి గుంతల పాలు చెయ్యమని ? మన వేదాలలో గీతలో చెప్పింది హవిస్సు ( హోమం ) మాత్రమె కదా ..? అమాయకులకు జ్ఞాన బోధ చెయ్యాల్సిన గురువులు పండితులు స్వాములు పీఠాధిపతులు అజ్ఞానాన్ని నూరి పోస్తూ ఇంకా ఎన్నాళ్ళు సమాజాన్ని ఇలా అజ్ఞానములో ఉంచుతారు ? ఇలా చెయ్యడం మన సనాతన ధర్మానికి మంచిదా ? మనం ఇలా చెయ్యడం వలెనే కదా అన్య మతాలూ రాచపుండు లాగా మన వ్యవస్థని మింగేస్తునాయి కదా ? అది వాళ్ళ తప్పా లేక మన తప్పా ?
శాంతంగా ఆలోచించండి, మనలోని తప్పిదాలను సరిదిద్దుకుందాం, మనలో మన వాళ్ళను అందరినీ కలుపుకోవడానికి ముందుకు కదులుదాం ..................! సువేరా

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.