Friday, October 2, 2015

దేశ భాషలందు తెలుగు లెస్స .

గతమెంతో ఘనకీర్తి కలవాడ ......దేశ భాషలందు తెలుగు లెస్స .
గౌరవనీయులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రివర్యులు గారికి నమస్కరించి సుంకర వెంకటేశ్వర రావు అను నేను ఒక తెలుగు భాష అభిమానిగా మీకు చేయుచున్న విన్నపము , మీరు పెద్దమనసుతో నా వినతిని స్వీకరించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ వివరాలు సోషల్ మీడియా ద్వారా మీ దృష్టికి తీసుకువద్దామనే ప్రయత్నం.
3000 సంవత్సరాల చరిత్ర కలిగిన మన తెలుగు భాష గొప్పదనం ప్రపంచం గుర్తించి గౌరవిస్తోంది.
అటువంటు భాష మన అధికార భాష, దానికి మనకు ఒక అధికారభాష సంఘం అని ఒకటి ఉంది, ఆ సంఘానికి తెలుగుభాష తెలుగు సంస్కృతీ సంప్రదాయాల మీద మంచి పట్టు అభినివేశము కలిగిన లబ్ధప్రతిష్టులను, సాహితీవేత్తలను , సాహిత్యంలో డాక్టరేట్ చేసిన వారిని కవులను తెలుగు భాషకు సేవ చేసిన వారిని పెద్దలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధ్యక్షులుగా నియమిస్తుంది, ఆ అధ్యక్షునికి కేబినేట్ హోదా ఇస్తారు. ఈ విషయాలు అన్నీ మీకు తెలియనివి కాదు.
ఈ సంఘానికి ఇప్పటివరకు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య , శ్రీ అబ్బూరి వరదరాజేశ్వరరావు , శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు , శ్రీ సి నారాయణరెడ్డి శ్రీ మండలి బుద్ధప్రసాద్ శ్రీ పరుచూరి గోపాలకృష్ణ లాంటి ఎందరో లబ్ధప్రతిష్టులు ఆ పదవి చేపట్టారు తెలుగు భాషకు సేవ చేసారు.
నేడు మన ఆంధ్రప్రదేశ మరలా ఒక కొత్త శకం మీ నాయకత్వంలో ప్రారంభం అవుచున్న సందర్భములో, ప్రపంచము ఇప్పుడు అంతా మన వైపు చూస్తున్న తరుణములో మన తెలుగుభాషకు కూడా మీ ద్వారా తగు గౌరవము గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఇటువంటి విషయాలను మీ సహచరులు మీ దృష్టికి తీసుకురాకుండా కూడా మన తెలుగుదేశంపార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారు.
కానీ నేడు ఆ అధికార తెలుగు భాష సంఘానికి అధ్యక్షునిగా అనామకులిని, కాపీలు కొట్టి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన కాకారాయుళ్ళను పైరవీకారులను లోకజ్ఞానము ఏమాత్రము లేనివారిని, భాషలోని అక్షరామాలిక తెలియనివారిని, భజన సామ్రాట్టులను, కనీసం వాళ్ళు పుట్టిన ఊళ్ళల్లోనూ జిల్లాలోను కూడా ఎవరికీ తెలియని అనామకులను, ఎవరితోనో కొన్ని పిచ్చ్చి వ్రాతలు వ్రాయించి వాటిని తనే వ్రాసినట్టి అచ్చు వేయించుకునే వాళ్ళను, ఇప్పటికిప్పుడు కులం కార్డు తీసి మిమ్మల్ని మోఖమాటం పెట్టేవారిని, మీ కుమారుడికి నచ్చిన బావిలోని కప్పలను ఏరుకు వచ్చి నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార తెలుగు భాష సంఘానికి అధ్యక్షునిగా నియమించాలిని చూడటం మన తెలుగుజాతి దౌర్భాగ్యం. ఇప్పటికి కూడా ఎవ్వరు కనీసం ప్రభుత్వ చర్యని మీ దృష్టికి తీసుకురాకపోవడం ప్రశ్నించలేక పోవడం అమానుషం.
ఇటువంటి చర్యలతో మనము మన భాష మన సంస్కృతీ నవ్వులపాలు కావడం అనివార్యం.
నేడు తెలుగునేల మీద మహామహా గొప్ప భాషావేత్తలు సాహితీవేత్తలు కవులు కళాకారులు అవధానులు సర్వశ్రీ డా . మేడసాని మోహన్, డా . గరికపాటి నరసింహారావు, డా మాడుగుల నాగఫణి శర్మ, శ్రీ వాసుదేవ దీక్షితులు , డా బేతవోలు రామబ్రహ్మం , కె విశ్వనాథ్ , సిరివెన్నెల సీతారామశాస్త్రి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు లాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు , ఇటువంటి వారికి ఇవ్వడము ద్వారా మనము మన భాషను గౌరవించుకున్నట్టు అవుతుంది, అలా కాకుండా కాకారాయుళ్ళకు, భజన రాయుళ్ళకు, పైరవీకారులకు ఇస్తే మాత్రం మన భాషను, సంస్కృతిని అవహేళన చేసుకున్నట్టు, నడిబజారులో అమ్ముకున్నట్టు అవుతుంది అని చెప్పడములో ఎటువంటి సందేహము అక్కరలేదు.
దయచేసి మీ చేతుల ద్వారా మన గొప్ప భాషకు అన్యాయం చెయ్యవద్దని అవమానం చెయ్యవద్దని అటువంటి పనిలో మీరు భాగస్వాములు కావద్దని చేతులెత్తి నమస్కరిస్తూ నా విన్నపాన్ని మరోసారి సానుకూలముగా స్వీకరిస్తారని ప్రార్ధిస్తున్నాను.
భవదీయుడు
సుంకర వెంకటేశ్వరరావు @ సువేరా @ ఎస్వీరావు

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.