Wednesday, September 30, 2015

తెలుగుదేశం అభిమానులకి బహిరంగ లేఖ:-

తెలుగుదేశం అభిమానులకి బహిరంగ లేఖ:-
రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే 2019 లో కూడా చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవడం అవసరం అని భావించే ఓ చంద్రబాబు అభిమాని, తెలుగుదేశం పార్టీ అభిమానులకి రాస్తున్న బహిరంగ లేఖ..
మిత్రులారా!
అడ్డగోలు విభజన తో నష్టపోయిన మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనీసం ఓ పదేళ్ళు ఒకే ముఖ్యమంత్రి ఒక విజన్ తో, దీక్షతో పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. అలాంటి విజన్, దీక్ష ఉంది అని నమ్మాము కాబట్టే మనం చంద్రబాబు కి మన ఓట్ల ద్వారా అధికారం అప్పగించాము. పదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే మళ్ళీ 2019 ఎన్నికల్లో గెలవాలి. చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 16 నెలలు పూర్తయ్యాయి. ఆయన ఏమైనా చెయ్యాలి అంటే 2018 డిసెంబర్ లోపు చేసెయ్యాలి, అంటే ఇంకా 39 నెలల టైం ఉంది. ఈ పదహారు నెలల్లో ఆయన ఏమి చేసారు? ఇంకా ఏమి చెయ్యబోతున్నారు? 2019 ఎన్నికల్లో తిరిగి గెలిచే స్థాయిలో ఆయన పాలన ఉందా, లేదా అని ఆయన ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని నమ్మే వ్యక్తులు ఆలోచించాలా, లేదా? పొరపాట్లు జరుగుతుంటే ప్రశ్నించాలా? లేక ఆయన ఏమి చేసినా రైటే అని గుడ్డిగా సమర్థించాలా?
నేను ప్రభుత్వం లో జరుగుతున్న తప్పులని పేస్ బుక్ లో ఎత్తి చూపితే అందరూ నన్ను విమర్శిస్తున్నారు. నన్ను అన్ ఫ్రెండ్ చేస్తున్నారు. అందుకే మూడు నెలలుగా fb కి దూరంగా ఉన్నాను. ఎంతో ఆవేదనతో ఈ ఉత్తరం రాస్తున్నాను. చంద్రబాబు ని ప్రశ్నించడం, విమర్శించడం ద్వారా మళ్ళీ ఆయనే గెలిచేలా చేద్దామా? లేక ఆయనని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతూ తప్పులని కప్పిపుచ్చుతూ ఎన్నికల్లో బొక్కబోర్లా పడదామా? ఆలోచించండి. ప్రస్తుత పరిస్థితుల్లో, చంద్రబాబు తప్ప ఏపి కి వేరే గత్యంతరం లేదు అని నమ్మే వ్యక్తిగా, చంద్రబాబు పాలనానుభవం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా ఈ లేఖ రాస్తున్నాను. తెలుగు దేశం కార్యకర్తలు, అభిమానులు అందరూ దీనిని చదివి, అర్థం చేసుకుని, పది మందికి షేర్ చేసి మంచి చర్చ జరిగేలా చూడవలసిందిగా కోరుతున్నాను.
16 నెలల పాలనలో చంద్రబాబు ఎక్కడ విఫలం అయ్యారో, ఎక్కడ తప్పు చేసారో చూద్దాం.
రైతులకి ఏం చేసారు?
2004 లో చంద్రబాబు అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ఆయన వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారనే ప్రచారం, రెండోది ఆయన రైతుల కోసం చేసిన పనులు అంత ఫలితాలు ఇవ్వకపోవడం. పదేళ్ళు అధికారానికి దూరమై మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ 16 నెలల్లో రైతులకోసం ఏమి చేసారో చెబుతారా? రుణమాఫీ చేసాము అని చెబుతున్నారు. ఆ విషయం లో రైతులు సంతృప్తిగా లేరు అనే మాట నిజం. తాత్కాలికంగా కొంతమంది రైతులు లాభం పొందినా అది ఎక్కువకాలం నిలబడదు. పట్టిసీమ పూర్తి చేసాం అని అనొచ్చు. అంతకు మించి ఏమి చేసారు అనేదే ప్రశ్న. డబ్బులుంటే సాగునీటి పాజెక్టులు కట్టొచ్చు, కాని వర్షాలు పడకపోతే, అప్పుడు ఏమవుతుంది? ఎలాంటి పరిస్థితులు వచ్చినా రైతులు తట్టుకుని నిలబడేలా చేయడం కదా విజన్ అంటే..అలాంటి విజన్ తో చేసిన పనులు ఒక్కటి చూపగలరా?
ఆ ఊపేది? ఉద్యమం లాంటి ఆ స్ఫూర్తి ఏది?
చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అభివృద్ధి ని ఆయన ఒక ఉద్యమం లా మలిచారు. జన్మభూమి, శ్రమదానం, నీరు-మీరు, క్లీన్ అండ్ గ్రీన్ ఇలా ఒక ఉద్యమం లా సాగింది ఆయన పాలన. ఇప్పుడా ఊపు ఎక్కడ? ప్రజల భాగస్వామ్యం ఏది? అప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని ప్రజలకి వివరించడం, కిందిస్థాయి అవినీతిని చాలా వరకు తగ్గించడం వల్ల, ప్రజలపై కొద్దిగా భారం మోపినా కూడా చంద్రబాబు 1999 లో తిరిగి అధికారం లోకి వచ్చారు. ఆ తర్వాత అవినీతి పెరగడం, ప్రజల భాగస్వామ్యం తగ్గడం లాంటి వాటి కారణంగా 2004 లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 2014 లో అధికారం లోకి వచ్చాక బాబు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి కాని, అవినీతిని తగ్గించడానికి కాని చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు. ఇలా అయితే 2019 లో ఎలా గెలుస్తారు?
ప్రత్యేక ఫ్లైట్లు, దుబారా ఖర్చులు:
ప్రధాని నరేంద్ర మోది ఒక్క సారి 10 లక్షల ఖరీదయిన సూట్ వేసుకుంటే, ఎంత రచ్చ అయిందో, ఆయనకి ఎంత మైనస్ అయిందో, ఢిల్లీ ఎన్నికల్లో ఎలా దెబ్బేసిందో చూసాం. మరి చంద్రబాబు హైదరాబాద్ లో తాత్కాలిక చాంబర్ కోసం 20 కోట్లు, ఉండవల్లి గెస్ట్ హౌస్ కోసం కొన్ని కోట్లు, ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్లు, 5.5 కోట్లతో స్పెషల్ బస్సు ఇవన్నీ చూస్తున్న పేద ప్రజలకి చంద్రబాబు మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఆలోచించారా? ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు ముఖ్యమంత్రి 5.5 కోట్ల బస్సు గురించి సూసైడ్ నోట్ లో ప్రస్తావించాడంటే, బాబుకి మీడియా ని మానేజ్ చేయడం చేతకావడం లేదని సర్దిచెప్పుకుందామా? లేక నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకుందామా?
సత్తా లేని మంత్రులు:
అయిదేళ్ళ రాజశేఖర్ రెడ్డి పాలన, ఆ తర్వాత అయిదేళ్ళు సాగిన విభజన ఉద్యమం కారణంగా రాష్ట్రం లో ఉన్నఅన్ని రంగాలూ భ్రష్టుపట్టిపోయాయి. వీటన్నిటిని బాగుచేసి దారిలో పెట్టాలంటే ఎంత కష్టం. ఎంత సమర్థత కావాలి. రాష్ట్ర కేబినెట్ లో ఓ నలుగురు తప్ప సమర్థులు ఎవరన్నా ఉన్నారా? తమ శాఖల మీద పట్టున్న మంత్రులు ఎంతమంది? కొత్త ఆలోచనలు చేసే శక్తి ఎంతమంది మంత్రులకి ఉంది? ఇలాంటి కేబినెట్ తో రాష్ట్రం ఎలా ముందుకు వెళుతుంది? చంద్రబాబు తన కేబినెట్ ని ఎందుకు ప్రక్షాళన చేయరు? మంత్రి పదవులు అప్పగించడానికి పదిమంది సమర్థులైన ఎమ్మెల్యేలే లేరా?
ఉద్యోగుల జీతాల పెంపు:
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ప్రాణ త్యాగాలకి కూడా సిద్దపడ్డ యోధులు కదా మన ఉద్యోగులు. అలాంటి వారు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అర్థం చేసుకుని, ఏ 20-25 శాతం ఫిట్ మెంట్ కో అంగీకరించేవారు కదా? అలాంటిది 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం ఎందుకు? ఇంత ఎక్కువగా జీతాలు పెంచడం వల్ల రాష్ట్రానికి ఆర్ధిక భారం తప్ప ఏం లాభం ఉంది? పోనీ వారు అడిగినంత జీతాలు పెంచేటప్పుడు అయినా, వారి పనితీరు మెరుగుపరచుకోవాడానికి, లంచాలు తగ్గించడానికి ఏమైనా కండీషన్స్ అయినా పెట్టారా? ప్రజలకి పైసా ఉపయోగం లేకుండా ఉద్యోగులకి 8వేల కోట్లు అదనంగా చెల్లించడం ఏమంత గొప్ప విజన్. ఉద్యోగులకి జీతాలు పెంచారని, జనం మళ్ళీ ఓట్లేస్తారా? పోనీ ఉద్యోగులని గట్టిగా పనిచేయమంటే ఉద్యోగులైనా మళ్ళీ మీకు ఓటేస్తారా?
అమరావతి నిర్మాణం:
అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించడం ద్వారా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నం. ఇదే చంద్రబాబు 2004 కి ముందు హైదరాబాద్ ని అద్భుతంగా డెవలప్ చేసారు కదా, ఎందుకు ఓడిపోయారు? అప్పుడు ఎందుకు ఓడిపోయారో, తెలిస్తే ఇప్పుడు ఎందుకు గెలుస్తారో ఆలోచించొచ్చు. హైదరాబాద్ ని డెవలప్ చేయడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. కాని ప్రజల జీవితాల్లో ఆ మార్పు పెద్దగా కనిపించలేదు. అందుకే 2004 లో ఓడిపోయారు. ఇప్పుడు అమరావతి నిర్మించడానికే పదేళ్ళు పడితే, దాని నుండి ఆదాయం వచ్చేదెప్పుడు? ఆ అబివృద్ధి ఫలాలు ప్రజలకి అందేది ఎప్పుడు? అమరావతి నిర్మించొద్దు అని చెప్పడం లేదు, అది ఒక్కటే సరిపోదు అని చెబుతున్నా.
గాలిలో మేడలు:
చంద్రబాబు గతంలో ప్రజలకి విజన్-2020 అని ఓ భవిష్యత్తును చూపించారు. విజన్ 2020 లో అభూత కల్పనలు లేవు, గాలిలో మేడలు లేవు. మేధావులు కూర్చుని ఆ డాక్యుమెంట్ తాయారు చేసారు. కాని ఇప్పుడు బాబు ఆచరణ సాధ్యంకాని హామీలు అన్నీ ఇస్తున్నారు. జిల్లాకి ఓ ఎయిర్ పోర్ట్, నిరుద్యోగులకి నెలకి 1500 లాంటి అసాధ్యమైన హామీలు ఇస్తున్నారు. అవన్నీ భవిష్యత్తులో ప్రత్యర్థులకి అస్త్రాలు కాబోతున్నాయి. చంద్రబాబు ని మాట నిలబెట్టుకోలేని మనిషిగా చూపబోతున్నాయి. ఇకనైనా ఇలాంటి గాలిలో మేడలు ఆపి, రాష్ట్ర పరిస్థితులని ప్రజలకి వివరించాలి. 10 పనులు చేస్తానని చెప్పి 8 పూర్తిచేస్తే జనం మళ్ళీ ఓటేస్తారు, అదే 50 చేస్తానని చెప్పి 9 పనులు చేస్తే వేటేస్తారు. సో, ఓటు కావాలా? వేటు కావాలా తేల్చుకో బాబూ అని హెచ్చరించడం తప్పు అవుతుందా?
బిజెపి హ్యాండిస్తే..!
రాష్ట్రవిభజన చట్టంలో ఉన్న హామీలని కూడా నెరవేర్చకుండా కేంద్రం మనకి మొండిచెయ్యి చూపుతోంది. బిజెపి ఎపి లో సొంతంగా ఎదగాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఓటుకి నోటు లాంటి చిన్న కేసు తోనే కేంద్రం దగ్గర లోకువయిపోయాం. రాష్ట్రం లో ఇప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ లో పదవులు అనుభవించి, కోట్లు పోగేసుకున్నోళ్ళు, ఇప్పుడు టిడిపి లో చేరి మళ్ళీ సంపాదన కొనసాగిస్తున్నారు. పదేళ్ళు అధికారానికి దూరంగా ఉండడం తో తెదేపా నాయకులు, కార్యకర్తలు కూడా చిల్లర అవినీతి మొదలు పెట్టారు. పొరపాటున ఒక్క స్కాం జరిగినా, కేంద్రంలో ఉన్న బిజెపి అవకాశం తీసుకోవచ్చు, తెదేపా ని దెబ్బతీయడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. అందుకే, చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెబితే అది తెలుగు దేశం వ్యతిరేక స్టాండ్ అవుతుందా?
ఏమీ లేని ఎపి ని అయిదేళ్ళలో డెవలప్ చేసి చూపిస్తే, తెలంగాణ లోకూడా ఆటోమాటిక్ గా టిడిపి బలపడుతుంది. అందుకే తెలంగాణ లో తెదేపా గెలవాలన్నా, ఆంధ్రాలో అద్భుతమైన పరిపాలన అందించడం అవసరం.
చివరిగా ఓ మాట. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ చంద్రబాబు ని మళ్ళీ గెలిపించుకుందామా? లేదు చంద్రబాబు భజన చేస్తూ, ఆహా ఓహో అంటూ మనల్ని మనం మోసం చేసుకుని 2019 లో ఓడిపోదామా? నిర్ణయం మీదే. మన రాష్ట్ర భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తెదేపా కార్యకర్తలపైనే ఆధారపడి ఉంది. ఇదీ నా ఆవేదన. నేను లేవనెత్తిన అంశాలు కరెక్ట్ అనిపిస్తే మీ మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయలు తెలుపండి.
ఇట్లు,
చంద్రబాబు అభిమాని,
నల్లూరి వెంకట సుబ్బారావు
ఒంగోలు

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.