Wednesday, September 30, 2015

సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

నేను పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా ( దివి తాలుకా ) మొవ్వ మండలం, పెదముత్తేవి అనే ఒక మాదిరి పెద్ద గ్రామం. మా గ్రామము చాలా చైతన్యవంతమైనది, ఎంతోమంది విద్యాధికులు పండితులు మేధావులు. మా గ్రామానికి కూతవేటు దూరములో నిమ్మకూరు చిన్న గ్రామం, మా రెండు గ్రామాల మధ్య దగ్గరి బంధుత్వాలు ఉన్నాయి.
కృష్ణా జిల్లాలో అతికొద్ది ( కేవలం 5 లేక 6 ) పాఠశాలలొ మాత్రమె ఉన్న సంస్కృత పాఠశాలలు మా గ్రామములో కూడా ఉంది.
మా గ్రామములో ఒక మంచి గ్రంధాలయం కూడా ఉంది.
ఇది 1977, నాకు అప్పుడు 12 ఏళ్ళు ,
అప్పటికే మా గ్రామములో చాలామంది ఇంజనీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్, లా లాంటి ఉన్నత చదువులు నేర్చిన వాళ్ళు నాకంటే 10 నుండి 15 సంవత్సరములు పెద్దవాళ్ళు చాలామంది ఉండేవారు , వారిలో నాకు బాబాయ్ మామ అన్న బావల వరస అయ్యేవాళ్ళు అందరూనూ.
నాకు చిన్నప్పటినుండి ఆటపాటలతోపాటు నిత్యమూ కొంచెం సేపైనా గ్రంధాలయంకి వెళ్లి చందమామ బాలమిత్ర సోవియట్ భూమి మరియు ఇతర కధల పుస్తకాలు చదువుకునే అలవాటు ఉండేది. మాకు ఆనాడు మాకు గ్రంధాలయములో తెలుగు పత్రికలతోపాటు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కూడా వచ్చేది. అలా గ్రంధాలయానికి వెళ్ళిన సమయములో నాకంటే పెద్దలు చాలా విద్యావంతులు చాలా చైతన్యవంతులు అయినవాళ్ళు అందరు అక్కడ చేరి అప్పుడు నడుస్తున్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉండేవారు. వారిలో ముఖ్యులు సర్వశ్రీ కాకర్ల దివ్వయ్య చౌదరి, కాకర్ల గోపీచంద్, లింగమనేని పూర్ణ భాస్కరరావు, జాస్తి లక్ష్మీనారాయణ, జాస్తి కృష్ణమూర్తి, జాస్తి ముత్తన్న, మన్నే సుబ్బారావు, లింగమనేని అప్పారావు, మన్నే ఠాగుర్, మన్నే కృష్ణ ప్రసాద్, కాకర్ల వెంకటేశ్వరరావు, కాకర్ల విజయకుమార్ లింగమనేని శివరామ ప్రసాద్ , మండవ ప్రేమచంద్ ఇంకా కొంతమంది ( కొన్ని పేర్లు ఇక్కడ ఉదాహరించాకూడదు). వీరందరూ అప్పట్లో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఇందిరాగాంధీ తన కుమారుడు సంజయ్ గాంధీని రాజ్యాంగేతర శక్తిగా తీసుకువచ్చి వారసత్వ పాలనకు పునాదులు వేస్తోందని, వ్యక్తీ ఆరాధన వారసత్వ పాలనతో రాజకీయ అరాచకం చేస్తోందని తీవ్రంగా చర్చించుకుంటూ ఉండేవారు , వారి చర్చ నాకు చాలా వినబుద్ధి అయ్యేది. వారు అందరు ఇండియన్ ఎక్స్ ప్రెస్ చదివేవారు, అది చూసి నాకు కూడా ఆ పత్రిక చదివే అలవాటు అయ్యింది ( నేను చదువుకున్నది పూర్తిగా తెలుగు మీడియం అయినా కూడా పట్టుదలతోనే ఇంగ్లీషు పేపరు చదవడం నేర్చుకున్నా, దానికి పైన చెప్పిన వారే ఆదర్శం ). నాకు చిన్నప్పటి నుండి పెద్దలు మాట్లాడుకుంటే శ్రద్ధగా వినేవాడిని. మా ఇంట్లో నన్ను పెంచి పెద్దచేసిన మా తాత ( అమ్మ తండ్రి ) కీశే నర్రా సీతయ్య గారు ఫక్తు కాంగ్రెస్ అభిమాని, ఇందిరా భక్తుడు, మా తండ్రి కీశే సత్యన్నారాయణ గారు కరడుగట్టిన కమ్యునిస్టు ( మార్క్సిస్టు ). మాతాతకు ఈ మాటలు అస్సలు నచ్చేవి కానేకాదు.
అప్పుడు కీశే జయప్రకాశ్ నారాయణ, మొరార్జీదేశాయ్, రాజనారాయన్ లాంటి గొప్పవారి నేతృత్వములో జనతాపార్టీ ఏర్పడింది. అప్పుడే నాకంటే పెద్దలు శ్రీ రామ్ మనోహర్ లోహియా గురించి మాట్లాడుకుంటూ ఉంటె విని మా గ్రంధాలయములో ఆయన రచనలు శ్రీ తుమ్మల చౌదరి గారు తెలుగు అనువాదం చేసిన ఇతిహాస చక్రం చదివాను, అర్ధం అవ్వడానికి అది వయసుకాదు నాకు సమాజ పరిపక్వత లేదు, అయినా చదివాను అనే ఒక గొప్ప అనుభూతి / గర్వం. 
ఆ 1977 ఎన్నికలలో జనతా పార్టీ గెలిచింది కొద్ది నెలలకే పోయింది, ఆ కాంగ్రెస్ వ్యతిరేక ఆవేశం మా గ్రామములో ఉన్న విద్యావంతులలో చావలేదు,
అలా నడుస్తున్న సమయములో తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలొని కాంగ్రెస్ వారికి తాకట్టు పెట్టబడుతున్న తరుణములో కాంగ్రెస్ వారసత్వ కుటుంబ పాలనకు దోపిడీకి అరాచక రాజకీయానికి వారి అవినీతికి వ్యతిరేకముగా కీశే ఎన్టీఆర్ శ్రీ నాదెండ్ల భాస్కరరావు ల నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడటం, ఆ పార్టీ సిద్ధాంతకర్తల లో మా సన్నిహిత బంధువు మా గ్రామస్తుడు కూడా ఉన్నారు. మా గ్రామములో ఉన్న విద్యావంతులు కాంగ్రెస్ వ్యతిరేకులు అందరు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో తెలుగుదేశంపార్టీలో చేరినవారు అందరి జీవితాలు తెరచిన పుస్తకాలే, అందరు నిస్వార్ధంగా సమాజహితం కోరే యువకులు. తెలుగుదేశం పార్టీ అధికారికముగా కీశే ఎన్టీఆర్ ద్వారా ఏర్పడక కొన్ని నెలల ముందే మా గ్రామములో శ్రీ కాకర్ల విజయకుమార్ తన స్వంత డబ్బుతో చాలా ఖరీదు అయిన ఆయిల్ పెయింటు తో చాలా పెద్దగా తెలుగుదేశం అనే పేరు పసుపు రంగు మీద ఆకుపచ్చ రంగుతో వ్రాయించారు, అది ఒక గొప్ప అనిర్వచనీయ అనుభూతి మా గ్రామస్తులకు. అప్పుడు నావయసు 17 ఏళ్ళు , మేము బొడ్డూడని బుడ్డ వాళ్ళం, మాకు రాజకీయం అక్షరం ముక్క తెలియదు, అయినా మాలో ఎన్టీఆర్ అంటే ఆవేశం, కాంగ్రెస్ అంటే ఒక పిచ్చి వ్యతిరేకత ( ఎన్టీఆర్ బంధుత్వం లేక ఒకే కులం అనే ప్రశక్తే లేదు , మా గ్రామములో నేటికీ కుల గజ్జి అనేది ఎవరిలోనూ మచ్చుకైనా ఉండదు, అందరం ఒక్కటే ) . అప్పుడు తెలుగుదేశంపార్టీలో చేరినవారు ఎవ్వరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని పదవులకోసం రాలేదు, కేవలం సమాజములో మంచి మార్పు కోసం, వారసత్వ కుటుంబ రాజకీయానికి వ్యతిరేకముగా, అవినీతి అరాచక కాంగ్రెస్ రాజకీయానికి వ్యతిరేకముగా ఉరకలెత్తిన ఉత్సాహంతో చేరినవారే అందరూ. అందుకే అప్పటి ప్రజలు తెలుగుదేశాన్ని గుండెల్లోను నెత్తిమీదా పెట్టుకుని మోశారు, అత్యధిక మెజారిటీతో గెలిపించారు, అప్పటినుండి ఎన్టీఆర్ ని నమ్మారు, ఆయన ఏనాడు ప్రజల, కార్యకర్తల నాయకుల నమ్మకాన్ని ఒమ్ము చెయ్యలేదు, ఆయన కొడుకులను కుమార్తెలను ఏనాడు రాజకీయాలలోకి రానివ్వలేదు. ( అప్పట్లో శ్రీ దగ్గుబాటి రావడానికి కారణాలు వేరు ). 
1994 వరకు తెదేపాలో విలువలు నిలబడుతూ వచ్చాయి, ఆతరువాత నుండి ప్రతి ఎన్నికలకు దిగాజారుకుంటూ నేడు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం భిన్నము కాకుండా అదే వారసత్వాన్ని, అదే అరాచక అవినీతి నాయకుల్ని ప్రోత్సహిస్తూ, అధికారము పదవులే పరమావధిగా నేడు 2015 వచ్చేసరికి గతములో ధైర్యంగా గర్వంతో అవినీతి అరాచక కాంగ్రెస్ వాళ్ళను తిట్టిన వాళ్లము నేడు వారి ముందు తలదించుకునే పరిస్థితిని సృష్టిస్తున్నారు. 
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తీ పూజను, వారసత్వరాజకీయాన్ని వ్యతిరేకించి తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక రోజులనుండి ఒకే పార్టీలో నిభాద్ధతతో అంకితభావముతొ ఉంటున్న నిస్వార్ధ విద్యావంతులు విజ్ఞులు మేధావులు నేడు తెదేపాలో అదే వ్యక్తీ పూజను, అదే వారసత్వరాజకీయాన్ని, అదే కుటుంబ పాలనను సమర్ధిస్తూ,( కొంతమంది వీలయితే ఇతరుల చేత తమనే ఆరాధింప చేసుకుంటూ , పొగిడించు కుంటూ ) ఉండే పరిస్థితి చూసి నేను ఇన్నాళ్ళు ( నా చిన్న నాటినుండి ) ఆరాధించిన అభిమానించిన నా స్వంతవారి గురించే / నా యొక్క ఆలోచనా విధానం గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నాలాగా మధనపడే తెదేపా కార్యకర్తలు, నిస్వార్ధ నాయకులు ఎందరో ...? 
రేపు మనల్ని ప్రశ్నించాల్సిందే అని అనుకునేవాళ్లు ఇంకెందరో ...?
రేపు మనము ఇంకేందరికి సహేతుక సమాధానాలు ఇవ్వాల్సివస్తుందో ...?
నేటికి రాష్ట్రములో తెదేపా అనుసరిస్తున్న వారసత్వ కుటుంబ రాజకీయాలకు, ధన రాజకీయాలకు ఎన్ని వందల వేల తెదేపా నాయకుల కుటుంబాలు జీవశ్చవాలుగా మారాయో ...? రేపటికి వారికి ఎవరు సమాధానం చెబుతారు ?
ఇన్నాళ్ళు తెదేపాని ఒక పల్లకిగా బోయీలుగా మోస్తున్న కార్యకర్తల నాయకుల జీవితాలను పునాదిరాళ్ళుగా చేసుకుని వారికి రెండులక్షల తాయిలం / కిరాయి ఆశ చూపిస్తూ ఇంకా ఎంతమంది అవకాశవాద రాజకీయ భవంతులు నిర్మించుకుంటారో ...? ఇంకెంతమంది దళారులను, ఇన్నాళ్ళు పార్టీకి తీవ్ర ద్రోహం, కుట్ర చేసిన / చేస్తున్న వాళ్ళను చేర్చుకుంటారో , ఎంతమందికి లాభం చేకురుస్తారో ...?
రేపటి సంగతి మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకుందాం అని అనుకునే బానిస మనస్కులు, స్వార్ధపరులు, భజన సామ్రాట్టులు నేడు నిజాలు మాట్లాడినవారి మీదకు, ప్రశ్నించిన వారి మీదకు రేసు కుక్కల్లాగా వస్తారనీ తెలుసు.
చూద్దాం .. చక్రవర్తుల మహారాజులు పాలించిన నాడు భూమి గుండ్రంగానే ఉంది, నేడు అలాగే ఉంది, రేపు అలాగే ఉంటుంది. భూమి చుట్టుకొలతలలో నాటికీ నేటికీ ఏనాటికీ మార్పు ఉండదు కదా ..! చరిత్రే సాక్ష్యం, ఈ నేలలో ఎన్ని చరిత్రలు మూతపడలేదు ? రేపు ఎన్ని పడవు ?
నేడు అవుతున్నది రేపటి చరిత్ర, రేపు ఏమవుతుందో భవిష్యత్తు చరిత్ర తప్పక చెబుతుంది..
.... సశేషం ... 
సువేరా

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.