Wednesday, September 30, 2015

తరువాత ...మీ ఖర్మ ...!!

అవినీతి కి
అమ్మా మొగుడ్లంటూ...
అరాచకానికి
అబ్బాజాన్ లంటూ...
జఫ్ఫాలని
ఏకిపారేసిన
తమ్ముళ్ళారా....
ఇప్పుడవే
అవినీతి జఫ్ఫాలు
ఒక్కొక్కటిగా
మీ పక్కలోకి చేరుతుంటే
సిగ్గులేకుండా భజన
చేస్తున్న మిమ్మల్నేమనాలి...??
వాళ్ళు జఫ్ఫాలు అయితే...
వాళ్ళకి కండువాలు కప్పి
దుప్పట్లోకి ఆహ్వానిస్తున్న
మిమ్మల్ని లోఫర్ లనాలా...??
అంతేగా...
వాళ్ళు " జ " భజనగాళ్ళు...
మీరు " లో " భజనగాళ్ళు....
ఆట్టే తేడా కనపడటం లేదు మాకు...
కనీసం మీకైనా తెలుస్తోందా...??
అప్పుడు ఆ వర్గంలో ఉన్న
అవినీతి చేపలొక్కొక్కటీ
మీ చెరువుల్లోకి దూకుతుంటే
మండూకాల్లా చెరువులోనే
బ్రతికే మీకు తెలియకపోవచ్చు...
కానీ ...ఆ అవినీతి
చేపల వాసన కి
ఓటర్ల ముక్కుపుటాలు
అదిరిపోతున్నాయ్ ఇక్కడ...!!
తొందరగా తేరుకోకపోతే...
తెలిసీ నిద్ర నటిస్తే...
జఫ్ఫాలనీ మిమ్మల్నీ
ఒకే గుంజకి కట్టేస్తారు జనం...
తరువాత ...మీ ఖర్మ ...!!
అందరికీ నీచు కంపు
అంటుకున్నాక.....
" రామ రామ " అన్నా
లాభం ఉండదు...
ఆ రాముడే దిగొచ్చినా...
ప్రయోజనం ఉండదు..!!

ఏమని బోధించారు ?

పగోజి నల్లజర్ల లో నిర్వహించిన తెదేపా కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఏమి బోధించారు ?
పార్టీ ఆఫీసుకు ఏనాడు రాకుండా దొడ్డి దారులలో ఎలా పదవులు కాంట్రాక్టులు పొందవచ్చు అనా ..?
అవసరానికి మనుషులను వాడుకుని అవసరం తీరినాక వారిని కీశే ఎన్టీఆర్ ని తీసేసినట్టు ఎలా తీసిపారేయ్యోచ్చు అనా ..?
పార్టీ జెండాకి పార్టీ ఎన్నికల గుర్తుకు తేడా తెలియకుండా పార్టీలో సభ్యత్వం లేకుండా భజన చేసే బ్రోకర్లను తీసుకువచ్చి అర్ధరాత్రికి అర్ధరాత్రే పదవులు ఇస్తుంటే నోరుమూసుకుని ఎలా ఉండాలి అనా ..?
పార్టీలో 30 ఏళ్ళుగా ఆస్తులు అమ్ముకుంటూ జెండాలు మోస్తున్న కార్యకర్తలని హిమ్సిసించి అక్రమ కేసులు బనాయించి హత్యలు చేసినవారిని సాదరంగా ఆహ్వానించి పెద్ద పీటలు వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి అనా ..?
చినబాబుకి భజన చేస్తూ , కాళ్ళు పిసుకుతూ, బట్టలు ఉతుకుతూ, పక్కలు వేస్తూ ఉన్దేవాల్లని చేరదీసి పదవులు ఇస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి అనా ...?
ఇసుక అక్రమ మైనింగ్ ఎలా చెయ్యాలి అనా ..?
పార్టీలు ఎలా మారాలి అనా ...?
పార్టీలు మారుస్తూ ప్రస్తుతానికి తెదేపాలోకి వచ్చిన వెధవలకు ఎలా సేవ చెయ్యాలి అనా ..?
సొంత పార్టీకి ఎలా ద్రోహం చెయ్యాలి అనా ...?
ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీ వాళ్ళతో ఎలా లాలుచి పడాలి అనా ..?
వారసత్వ రాజకీయాన్ని సమర్ధవంతంగా ఎలా పోషించాలి అనా ..?
డబ్బుతో రాజకీయం ఎలా చెయ్యాలి అనా ...?
భజన ఎలా చెయ్యాలి అనా ...?
జీవితాంతం బానిసలుగా బోయీలుగా ఉంటూ పార్టీలు మార్చే బ్రోకర్లను పార్టీని అడ్డం పెట్టుకుని అక్రమంగా దోచుకున్న వారిని ఎలా మోయాలి అనా ...?
తండ్రి పేరుతొ తాత పేరుతొ భర్త పేరుతొ అన్న పేరుతొ రాజకీయ పదవులు అనుభవించెవారిని కిరాయి కూలీలుగా ఎలా మొయ్యాలి అనా ...?
పార్టీ అధికారములో లేనప్పుడు పార్టీ ముఖం చూడకుండా పార్టీని పట్టించుకోకుండా ఇతర పార్టీల నాయకులతో కలిసి అక్రమ వ్యాపారాలు చేసి దోచుకున్న వారు  ఇప్పుడు అధికారములోకి రాగానే మరలా రంగులు మార్చి చినబాబు భజన పోటీపడి చేస్తూ వంగివంగి బానిసలుగా మారి మరలా దోచుకోవడానికి సిద్ధం అయిన వారిని, దోచుకుంటున్న వారిని ఎలా కాపాడాలి అనా ..?
పార్టీలో టిక్కట్లు పదవులు ఎలా కొనుక్కోవాలి అనా ..?
ఏమని బోధించారు ?

తెలుగుదేశం అభిమానులకి బహిరంగ లేఖ:-

తెలుగుదేశం అభిమానులకి బహిరంగ లేఖ:-
రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే 2019 లో కూడా చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవడం అవసరం అని భావించే ఓ చంద్రబాబు అభిమాని, తెలుగుదేశం పార్టీ అభిమానులకి రాస్తున్న బహిరంగ లేఖ..
మిత్రులారా!
అడ్డగోలు విభజన తో నష్టపోయిన మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనీసం ఓ పదేళ్ళు ఒకే ముఖ్యమంత్రి ఒక విజన్ తో, దీక్షతో పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. అలాంటి విజన్, దీక్ష ఉంది అని నమ్మాము కాబట్టే మనం చంద్రబాబు కి మన ఓట్ల ద్వారా అధికారం అప్పగించాము. పదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే మళ్ళీ 2019 ఎన్నికల్లో గెలవాలి. చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 16 నెలలు పూర్తయ్యాయి. ఆయన ఏమైనా చెయ్యాలి అంటే 2018 డిసెంబర్ లోపు చేసెయ్యాలి, అంటే ఇంకా 39 నెలల టైం ఉంది. ఈ పదహారు నెలల్లో ఆయన ఏమి చేసారు? ఇంకా ఏమి చెయ్యబోతున్నారు? 2019 ఎన్నికల్లో తిరిగి గెలిచే స్థాయిలో ఆయన పాలన ఉందా, లేదా అని ఆయన ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని నమ్మే వ్యక్తులు ఆలోచించాలా, లేదా? పొరపాట్లు జరుగుతుంటే ప్రశ్నించాలా? లేక ఆయన ఏమి చేసినా రైటే అని గుడ్డిగా సమర్థించాలా?
నేను ప్రభుత్వం లో జరుగుతున్న తప్పులని పేస్ బుక్ లో ఎత్తి చూపితే అందరూ నన్ను విమర్శిస్తున్నారు. నన్ను అన్ ఫ్రెండ్ చేస్తున్నారు. అందుకే మూడు నెలలుగా fb కి దూరంగా ఉన్నాను. ఎంతో ఆవేదనతో ఈ ఉత్తరం రాస్తున్నాను. చంద్రబాబు ని ప్రశ్నించడం, విమర్శించడం ద్వారా మళ్ళీ ఆయనే గెలిచేలా చేద్దామా? లేక ఆయనని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతూ తప్పులని కప్పిపుచ్చుతూ ఎన్నికల్లో బొక్కబోర్లా పడదామా? ఆలోచించండి. ప్రస్తుత పరిస్థితుల్లో, చంద్రబాబు తప్ప ఏపి కి వేరే గత్యంతరం లేదు అని నమ్మే వ్యక్తిగా, చంద్రబాబు పాలనానుభవం మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా ఈ లేఖ రాస్తున్నాను. తెలుగు దేశం కార్యకర్తలు, అభిమానులు అందరూ దీనిని చదివి, అర్థం చేసుకుని, పది మందికి షేర్ చేసి మంచి చర్చ జరిగేలా చూడవలసిందిగా కోరుతున్నాను.
16 నెలల పాలనలో చంద్రబాబు ఎక్కడ విఫలం అయ్యారో, ఎక్కడ తప్పు చేసారో చూద్దాం.
రైతులకి ఏం చేసారు?
2004 లో చంద్రబాబు అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ఆయన వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారనే ప్రచారం, రెండోది ఆయన రైతుల కోసం చేసిన పనులు అంత ఫలితాలు ఇవ్వకపోవడం. పదేళ్ళు అధికారానికి దూరమై మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ 16 నెలల్లో రైతులకోసం ఏమి చేసారో చెబుతారా? రుణమాఫీ చేసాము అని చెబుతున్నారు. ఆ విషయం లో రైతులు సంతృప్తిగా లేరు అనే మాట నిజం. తాత్కాలికంగా కొంతమంది రైతులు లాభం పొందినా అది ఎక్కువకాలం నిలబడదు. పట్టిసీమ పూర్తి చేసాం అని అనొచ్చు. అంతకు మించి ఏమి చేసారు అనేదే ప్రశ్న. డబ్బులుంటే సాగునీటి పాజెక్టులు కట్టొచ్చు, కాని వర్షాలు పడకపోతే, అప్పుడు ఏమవుతుంది? ఎలాంటి పరిస్థితులు వచ్చినా రైతులు తట్టుకుని నిలబడేలా చేయడం కదా విజన్ అంటే..అలాంటి విజన్ తో చేసిన పనులు ఒక్కటి చూపగలరా?
ఆ ఊపేది? ఉద్యమం లాంటి ఆ స్ఫూర్తి ఏది?
చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అభివృద్ధి ని ఆయన ఒక ఉద్యమం లా మలిచారు. జన్మభూమి, శ్రమదానం, నీరు-మీరు, క్లీన్ అండ్ గ్రీన్ ఇలా ఒక ఉద్యమం లా సాగింది ఆయన పాలన. ఇప్పుడా ఊపు ఎక్కడ? ప్రజల భాగస్వామ్యం ఏది? అప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని ప్రజలకి వివరించడం, కిందిస్థాయి అవినీతిని చాలా వరకు తగ్గించడం వల్ల, ప్రజలపై కొద్దిగా భారం మోపినా కూడా చంద్రబాబు 1999 లో తిరిగి అధికారం లోకి వచ్చారు. ఆ తర్వాత అవినీతి పెరగడం, ప్రజల భాగస్వామ్యం తగ్గడం లాంటి వాటి కారణంగా 2004 లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 2014 లో అధికారం లోకి వచ్చాక బాబు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి కాని, అవినీతిని తగ్గించడానికి కాని చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు. ఇలా అయితే 2019 లో ఎలా గెలుస్తారు?
ప్రత్యేక ఫ్లైట్లు, దుబారా ఖర్చులు:
ప్రధాని నరేంద్ర మోది ఒక్క సారి 10 లక్షల ఖరీదయిన సూట్ వేసుకుంటే, ఎంత రచ్చ అయిందో, ఆయనకి ఎంత మైనస్ అయిందో, ఢిల్లీ ఎన్నికల్లో ఎలా దెబ్బేసిందో చూసాం. మరి చంద్రబాబు హైదరాబాద్ లో తాత్కాలిక చాంబర్ కోసం 20 కోట్లు, ఉండవల్లి గెస్ట్ హౌస్ కోసం కొన్ని కోట్లు, ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్లు, 5.5 కోట్లతో స్పెషల్ బస్సు ఇవన్నీ చూస్తున్న పేద ప్రజలకి చంద్రబాబు మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఆలోచించారా? ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు ముఖ్యమంత్రి 5.5 కోట్ల బస్సు గురించి సూసైడ్ నోట్ లో ప్రస్తావించాడంటే, బాబుకి మీడియా ని మానేజ్ చేయడం చేతకావడం లేదని సర్దిచెప్పుకుందామా? లేక నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకుందామా?
సత్తా లేని మంత్రులు:
అయిదేళ్ళ రాజశేఖర్ రెడ్డి పాలన, ఆ తర్వాత అయిదేళ్ళు సాగిన విభజన ఉద్యమం కారణంగా రాష్ట్రం లో ఉన్నఅన్ని రంగాలూ భ్రష్టుపట్టిపోయాయి. వీటన్నిటిని బాగుచేసి దారిలో పెట్టాలంటే ఎంత కష్టం. ఎంత సమర్థత కావాలి. రాష్ట్ర కేబినెట్ లో ఓ నలుగురు తప్ప సమర్థులు ఎవరన్నా ఉన్నారా? తమ శాఖల మీద పట్టున్న మంత్రులు ఎంతమంది? కొత్త ఆలోచనలు చేసే శక్తి ఎంతమంది మంత్రులకి ఉంది? ఇలాంటి కేబినెట్ తో రాష్ట్రం ఎలా ముందుకు వెళుతుంది? చంద్రబాబు తన కేబినెట్ ని ఎందుకు ప్రక్షాళన చేయరు? మంత్రి పదవులు అప్పగించడానికి పదిమంది సమర్థులైన ఎమ్మెల్యేలే లేరా?
ఉద్యోగుల జీతాల పెంపు:
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ప్రాణ త్యాగాలకి కూడా సిద్దపడ్డ యోధులు కదా మన ఉద్యోగులు. అలాంటి వారు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అర్థం చేసుకుని, ఏ 20-25 శాతం ఫిట్ మెంట్ కో అంగీకరించేవారు కదా? అలాంటిది 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం ఎందుకు? ఇంత ఎక్కువగా జీతాలు పెంచడం వల్ల రాష్ట్రానికి ఆర్ధిక భారం తప్ప ఏం లాభం ఉంది? పోనీ వారు అడిగినంత జీతాలు పెంచేటప్పుడు అయినా, వారి పనితీరు మెరుగుపరచుకోవాడానికి, లంచాలు తగ్గించడానికి ఏమైనా కండీషన్స్ అయినా పెట్టారా? ప్రజలకి పైసా ఉపయోగం లేకుండా ఉద్యోగులకి 8వేల కోట్లు అదనంగా చెల్లించడం ఏమంత గొప్ప విజన్. ఉద్యోగులకి జీతాలు పెంచారని, జనం మళ్ళీ ఓట్లేస్తారా? పోనీ ఉద్యోగులని గట్టిగా పనిచేయమంటే ఉద్యోగులైనా మళ్ళీ మీకు ఓటేస్తారా?
అమరావతి నిర్మాణం:
అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించడం ద్వారా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నం. ఇదే చంద్రబాబు 2004 కి ముందు హైదరాబాద్ ని అద్భుతంగా డెవలప్ చేసారు కదా, ఎందుకు ఓడిపోయారు? అప్పుడు ఎందుకు ఓడిపోయారో, తెలిస్తే ఇప్పుడు ఎందుకు గెలుస్తారో ఆలోచించొచ్చు. హైదరాబాద్ ని డెవలప్ చేయడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. కాని ప్రజల జీవితాల్లో ఆ మార్పు పెద్దగా కనిపించలేదు. అందుకే 2004 లో ఓడిపోయారు. ఇప్పుడు అమరావతి నిర్మించడానికే పదేళ్ళు పడితే, దాని నుండి ఆదాయం వచ్చేదెప్పుడు? ఆ అబివృద్ధి ఫలాలు ప్రజలకి అందేది ఎప్పుడు? అమరావతి నిర్మించొద్దు అని చెప్పడం లేదు, అది ఒక్కటే సరిపోదు అని చెబుతున్నా.
గాలిలో మేడలు:
చంద్రబాబు గతంలో ప్రజలకి విజన్-2020 అని ఓ భవిష్యత్తును చూపించారు. విజన్ 2020 లో అభూత కల్పనలు లేవు, గాలిలో మేడలు లేవు. మేధావులు కూర్చుని ఆ డాక్యుమెంట్ తాయారు చేసారు. కాని ఇప్పుడు బాబు ఆచరణ సాధ్యంకాని హామీలు అన్నీ ఇస్తున్నారు. జిల్లాకి ఓ ఎయిర్ పోర్ట్, నిరుద్యోగులకి నెలకి 1500 లాంటి అసాధ్యమైన హామీలు ఇస్తున్నారు. అవన్నీ భవిష్యత్తులో ప్రత్యర్థులకి అస్త్రాలు కాబోతున్నాయి. చంద్రబాబు ని మాట నిలబెట్టుకోలేని మనిషిగా చూపబోతున్నాయి. ఇకనైనా ఇలాంటి గాలిలో మేడలు ఆపి, రాష్ట్ర పరిస్థితులని ప్రజలకి వివరించాలి. 10 పనులు చేస్తానని చెప్పి 8 పూర్తిచేస్తే జనం మళ్ళీ ఓటేస్తారు, అదే 50 చేస్తానని చెప్పి 9 పనులు చేస్తే వేటేస్తారు. సో, ఓటు కావాలా? వేటు కావాలా తేల్చుకో బాబూ అని హెచ్చరించడం తప్పు అవుతుందా?
బిజెపి హ్యాండిస్తే..!
రాష్ట్రవిభజన చట్టంలో ఉన్న హామీలని కూడా నెరవేర్చకుండా కేంద్రం మనకి మొండిచెయ్యి చూపుతోంది. బిజెపి ఎపి లో సొంతంగా ఎదగాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఓటుకి నోటు లాంటి చిన్న కేసు తోనే కేంద్రం దగ్గర లోకువయిపోయాం. రాష్ట్రం లో ఇప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ లో పదవులు అనుభవించి, కోట్లు పోగేసుకున్నోళ్ళు, ఇప్పుడు టిడిపి లో చేరి మళ్ళీ సంపాదన కొనసాగిస్తున్నారు. పదేళ్ళు అధికారానికి దూరంగా ఉండడం తో తెదేపా నాయకులు, కార్యకర్తలు కూడా చిల్లర అవినీతి మొదలు పెట్టారు. పొరపాటున ఒక్క స్కాం జరిగినా, కేంద్రంలో ఉన్న బిజెపి అవకాశం తీసుకోవచ్చు, తెదేపా ని దెబ్బతీయడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. అందుకే, చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెబితే అది తెలుగు దేశం వ్యతిరేక స్టాండ్ అవుతుందా?
ఏమీ లేని ఎపి ని అయిదేళ్ళలో డెవలప్ చేసి చూపిస్తే, తెలంగాణ లోకూడా ఆటోమాటిక్ గా టిడిపి బలపడుతుంది. అందుకే తెలంగాణ లో తెదేపా గెలవాలన్నా, ఆంధ్రాలో అద్భుతమైన పరిపాలన అందించడం అవసరం.
చివరిగా ఓ మాట. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ చంద్రబాబు ని మళ్ళీ గెలిపించుకుందామా? లేదు చంద్రబాబు భజన చేస్తూ, ఆహా ఓహో అంటూ మనల్ని మనం మోసం చేసుకుని 2019 లో ఓడిపోదామా? నిర్ణయం మీదే. మన రాష్ట్ర భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తెదేపా కార్యకర్తలపైనే ఆధారపడి ఉంది. ఇదీ నా ఆవేదన. నేను లేవనెత్తిన అంశాలు కరెక్ట్ అనిపిస్తే మీ మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయలు తెలుపండి.
ఇట్లు,
చంద్రబాబు అభిమాని,
నల్లూరి వెంకట సుబ్బారావు
ఒంగోలు

అయితే ఓకే అల్లుడు గారు ...! .

అల్లుడు గారు ...!
శ్రీ డొక్కా మాణిక్య ప్రసాదా ...! ( అంటే ఒకప్పటి కాంగ్రెస్ మంత్రి కాదు కదా ...! )
శ్రీ జూపూడి ప్రభాకరా ...! ( అంటే ఒకప్పటి వయ్యెస్సార్ కాంగ్రెస్ కాదు కదా ...! )
శ్రీ అవంతి శ్రీనివాసా ...! ( అంటే ఒకప్పటి ప్రజారాజ్యం కాదు కదా ........! )
శ్రీమతి ముళ్ళపూడి రేణుకా ...! ( అంటే పార్టీ ఓడిపోయినాక మొఖం చాటేసిన అప్పటి అధికార ప్రతినిధి కాదు కదా ...! )
అల్లుడు గారు ఎవరండీ వీళ్ళు ...?
ఓహో ... తెగులుదేశం పార్టీ వ్యవస్థాపక రోజులనుండి పార్టీకోసం చెమట ధారపోసిన, ఆస్తులు కరిగించుకున్న, పార్టీలు అసలు ఏనాడు మారని నిఖార్సు వీరులా .... అయితే ఓకే అల్లుడు గారు ...! .
అసలు ఇంతకీ నేడు ఉన్నది తెలుగుదేశం పార్టీనా లేక తెగులుదేశం పార్టీనా ...? నాకు ఒక చిన్న డౌటు అంతే అల్లుడు గారు ...!
శ్రీ వైఎస్ జగన్ , శ్రీమతి వైఎస్ విజయలక్ష్మి, శ్రీ కేవీపీ , శ్రీమతి లక్ష్మీ పార్వతి, శ్రీమతి వాసిరెడ్డి పద్మ , శ్రీమతి రోజా , శ్రీమతి గంగుల భానుమతి, శ్రీ గాలి జనార్ధన రెడ్డి, శ్రీ వైవీ సుబ్బారెడ్డి , శ్రీ విజయసాయి రెడ్డి , శ్రీ సోమయాజులు, శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్, శ్రీ వీ హనుమంతరావు , శ్రీ కరుణాకర్ రెడ్డి , శ్రీ చెవిరెడ్డి , శ్రీ మంగలి కృష్ణ , శ్రీ బ్రదర్ అనిల్ వీళ్ళేమి పాపం చేసారు అల్లుడు గారు ... ? వీళ్ళు కూడా మన పార్టీకోసం బాగా శ్రమించారు కష్టపడ్డారు కదా , వీళ్ళను పోలిట్ బ్యురోలోకి తీసుకుంటే బాగుండేది కదా అల్లుడు గారు ...! ...?

విద్యావంతులతోనే

మన భగవద్గీత లాంటి గ్రంధాలు మూఢులకు భజనమార్గం, విద్యావంతులకు జ్ఞానమార్గం, వివేవుకులకు కార్యకారణ విభాజన మార్గం లాంటివి సూచించింది.
కానీ నేడు శీను రివర్సు,
బాగా చదువుకున్నవాళ్ళు భజన మార్గం, అక్షరాస్యత లేనివాళ్ళు కార్యకారణ విభాజన మార్గం, చేతగానివాళ్ళు జ్ఞానమార్గంలో నడుస్తున్నారు.
దురదృష్టం కొద్దీ సమాజం విద్యావంతులతోనే ఎక్కువ నింపబడింది...... సువేరా

సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

నేను పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా ( దివి తాలుకా ) మొవ్వ మండలం, పెదముత్తేవి అనే ఒక మాదిరి పెద్ద గ్రామం. మా గ్రామము చాలా చైతన్యవంతమైనది, ఎంతోమంది విద్యాధికులు పండితులు మేధావులు. మా గ్రామానికి కూతవేటు దూరములో నిమ్మకూరు చిన్న గ్రామం, మా రెండు గ్రామాల మధ్య దగ్గరి బంధుత్వాలు ఉన్నాయి.
కృష్ణా జిల్లాలో అతికొద్ది ( కేవలం 5 లేక 6 ) పాఠశాలలొ మాత్రమె ఉన్న సంస్కృత పాఠశాలలు మా గ్రామములో కూడా ఉంది.
మా గ్రామములో ఒక మంచి గ్రంధాలయం కూడా ఉంది.
ఇది 1977, నాకు అప్పుడు 12 ఏళ్ళు ,
అప్పటికే మా గ్రామములో చాలామంది ఇంజనీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్, లా లాంటి ఉన్నత చదువులు నేర్చిన వాళ్ళు నాకంటే 10 నుండి 15 సంవత్సరములు పెద్దవాళ్ళు చాలామంది ఉండేవారు , వారిలో నాకు బాబాయ్ మామ అన్న బావల వరస అయ్యేవాళ్ళు అందరూనూ.
నాకు చిన్నప్పటినుండి ఆటపాటలతోపాటు నిత్యమూ కొంచెం సేపైనా గ్రంధాలయంకి వెళ్లి చందమామ బాలమిత్ర సోవియట్ భూమి మరియు ఇతర కధల పుస్తకాలు చదువుకునే అలవాటు ఉండేది. మాకు ఆనాడు మాకు గ్రంధాలయములో తెలుగు పత్రికలతోపాటు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కూడా వచ్చేది. అలా గ్రంధాలయానికి వెళ్ళిన సమయములో నాకంటే పెద్దలు చాలా విద్యావంతులు చాలా చైతన్యవంతులు అయినవాళ్ళు అందరు అక్కడ చేరి అప్పుడు నడుస్తున్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉండేవారు. వారిలో ముఖ్యులు సర్వశ్రీ కాకర్ల దివ్వయ్య చౌదరి, కాకర్ల గోపీచంద్, లింగమనేని పూర్ణ భాస్కరరావు, జాస్తి లక్ష్మీనారాయణ, జాస్తి కృష్ణమూర్తి, జాస్తి ముత్తన్న, మన్నే సుబ్బారావు, లింగమనేని అప్పారావు, మన్నే ఠాగుర్, మన్నే కృష్ణ ప్రసాద్, కాకర్ల వెంకటేశ్వరరావు, కాకర్ల విజయకుమార్ లింగమనేని శివరామ ప్రసాద్ , మండవ ప్రేమచంద్ ఇంకా కొంతమంది ( కొన్ని పేర్లు ఇక్కడ ఉదాహరించాకూడదు). వీరందరూ అప్పట్లో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఇందిరాగాంధీ తన కుమారుడు సంజయ్ గాంధీని రాజ్యాంగేతర శక్తిగా తీసుకువచ్చి వారసత్వ పాలనకు పునాదులు వేస్తోందని, వ్యక్తీ ఆరాధన వారసత్వ పాలనతో రాజకీయ అరాచకం చేస్తోందని తీవ్రంగా చర్చించుకుంటూ ఉండేవారు , వారి చర్చ నాకు చాలా వినబుద్ధి అయ్యేది. వారు అందరు ఇండియన్ ఎక్స్ ప్రెస్ చదివేవారు, అది చూసి నాకు కూడా ఆ పత్రిక చదివే అలవాటు అయ్యింది ( నేను చదువుకున్నది పూర్తిగా తెలుగు మీడియం అయినా కూడా పట్టుదలతోనే ఇంగ్లీషు పేపరు చదవడం నేర్చుకున్నా, దానికి పైన చెప్పిన వారే ఆదర్శం ). నాకు చిన్నప్పటి నుండి పెద్దలు మాట్లాడుకుంటే శ్రద్ధగా వినేవాడిని. మా ఇంట్లో నన్ను పెంచి పెద్దచేసిన మా తాత ( అమ్మ తండ్రి ) కీశే నర్రా సీతయ్య గారు ఫక్తు కాంగ్రెస్ అభిమాని, ఇందిరా భక్తుడు, మా తండ్రి కీశే సత్యన్నారాయణ గారు కరడుగట్టిన కమ్యునిస్టు ( మార్క్సిస్టు ). మాతాతకు ఈ మాటలు అస్సలు నచ్చేవి కానేకాదు.
అప్పుడు కీశే జయప్రకాశ్ నారాయణ, మొరార్జీదేశాయ్, రాజనారాయన్ లాంటి గొప్పవారి నేతృత్వములో జనతాపార్టీ ఏర్పడింది. అప్పుడే నాకంటే పెద్దలు శ్రీ రామ్ మనోహర్ లోహియా గురించి మాట్లాడుకుంటూ ఉంటె విని మా గ్రంధాలయములో ఆయన రచనలు శ్రీ తుమ్మల చౌదరి గారు తెలుగు అనువాదం చేసిన ఇతిహాస చక్రం చదివాను, అర్ధం అవ్వడానికి అది వయసుకాదు నాకు సమాజ పరిపక్వత లేదు, అయినా చదివాను అనే ఒక గొప్ప అనుభూతి / గర్వం. 
ఆ 1977 ఎన్నికలలో జనతా పార్టీ గెలిచింది కొద్ది నెలలకే పోయింది, ఆ కాంగ్రెస్ వ్యతిరేక ఆవేశం మా గ్రామములో ఉన్న విద్యావంతులలో చావలేదు,
అలా నడుస్తున్న సమయములో తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలొని కాంగ్రెస్ వారికి తాకట్టు పెట్టబడుతున్న తరుణములో కాంగ్రెస్ వారసత్వ కుటుంబ పాలనకు దోపిడీకి అరాచక రాజకీయానికి వారి అవినీతికి వ్యతిరేకముగా కీశే ఎన్టీఆర్ శ్రీ నాదెండ్ల భాస్కరరావు ల నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడటం, ఆ పార్టీ సిద్ధాంతకర్తల లో మా సన్నిహిత బంధువు మా గ్రామస్తుడు కూడా ఉన్నారు. మా గ్రామములో ఉన్న విద్యావంతులు కాంగ్రెస్ వ్యతిరేకులు అందరు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో తెలుగుదేశంపార్టీలో చేరినవారు అందరి జీవితాలు తెరచిన పుస్తకాలే, అందరు నిస్వార్ధంగా సమాజహితం కోరే యువకులు. తెలుగుదేశం పార్టీ అధికారికముగా కీశే ఎన్టీఆర్ ద్వారా ఏర్పడక కొన్ని నెలల ముందే మా గ్రామములో శ్రీ కాకర్ల విజయకుమార్ తన స్వంత డబ్బుతో చాలా ఖరీదు అయిన ఆయిల్ పెయింటు తో చాలా పెద్దగా తెలుగుదేశం అనే పేరు పసుపు రంగు మీద ఆకుపచ్చ రంగుతో వ్రాయించారు, అది ఒక గొప్ప అనిర్వచనీయ అనుభూతి మా గ్రామస్తులకు. అప్పుడు నావయసు 17 ఏళ్ళు , మేము బొడ్డూడని బుడ్డ వాళ్ళం, మాకు రాజకీయం అక్షరం ముక్క తెలియదు, అయినా మాలో ఎన్టీఆర్ అంటే ఆవేశం, కాంగ్రెస్ అంటే ఒక పిచ్చి వ్యతిరేకత ( ఎన్టీఆర్ బంధుత్వం లేక ఒకే కులం అనే ప్రశక్తే లేదు , మా గ్రామములో నేటికీ కుల గజ్జి అనేది ఎవరిలోనూ మచ్చుకైనా ఉండదు, అందరం ఒక్కటే ) . అప్పుడు తెలుగుదేశంపార్టీలో చేరినవారు ఎవ్వరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని పదవులకోసం రాలేదు, కేవలం సమాజములో మంచి మార్పు కోసం, వారసత్వ కుటుంబ రాజకీయానికి వ్యతిరేకముగా, అవినీతి అరాచక కాంగ్రెస్ రాజకీయానికి వ్యతిరేకముగా ఉరకలెత్తిన ఉత్సాహంతో చేరినవారే అందరూ. అందుకే అప్పటి ప్రజలు తెలుగుదేశాన్ని గుండెల్లోను నెత్తిమీదా పెట్టుకుని మోశారు, అత్యధిక మెజారిటీతో గెలిపించారు, అప్పటినుండి ఎన్టీఆర్ ని నమ్మారు, ఆయన ఏనాడు ప్రజల, కార్యకర్తల నాయకుల నమ్మకాన్ని ఒమ్ము చెయ్యలేదు, ఆయన కొడుకులను కుమార్తెలను ఏనాడు రాజకీయాలలోకి రానివ్వలేదు. ( అప్పట్లో శ్రీ దగ్గుబాటి రావడానికి కారణాలు వేరు ). 
1994 వరకు తెదేపాలో విలువలు నిలబడుతూ వచ్చాయి, ఆతరువాత నుండి ప్రతి ఎన్నికలకు దిగాజారుకుంటూ నేడు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం భిన్నము కాకుండా అదే వారసత్వాన్ని, అదే అరాచక అవినీతి నాయకుల్ని ప్రోత్సహిస్తూ, అధికారము పదవులే పరమావధిగా నేడు 2015 వచ్చేసరికి గతములో ధైర్యంగా గర్వంతో అవినీతి అరాచక కాంగ్రెస్ వాళ్ళను తిట్టిన వాళ్లము నేడు వారి ముందు తలదించుకునే పరిస్థితిని సృష్టిస్తున్నారు. 
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తీ పూజను, వారసత్వరాజకీయాన్ని వ్యతిరేకించి తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక రోజులనుండి ఒకే పార్టీలో నిభాద్ధతతో అంకితభావముతొ ఉంటున్న నిస్వార్ధ విద్యావంతులు విజ్ఞులు మేధావులు నేడు తెదేపాలో అదే వ్యక్తీ పూజను, అదే వారసత్వరాజకీయాన్ని, అదే కుటుంబ పాలనను సమర్ధిస్తూ,( కొంతమంది వీలయితే ఇతరుల చేత తమనే ఆరాధింప చేసుకుంటూ , పొగిడించు కుంటూ ) ఉండే పరిస్థితి చూసి నేను ఇన్నాళ్ళు ( నా చిన్న నాటినుండి ) ఆరాధించిన అభిమానించిన నా స్వంతవారి గురించే / నా యొక్క ఆలోచనా విధానం గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నాలాగా మధనపడే తెదేపా కార్యకర్తలు, నిస్వార్ధ నాయకులు ఎందరో ...? 
రేపు మనల్ని ప్రశ్నించాల్సిందే అని అనుకునేవాళ్లు ఇంకెందరో ...?
రేపు మనము ఇంకేందరికి సహేతుక సమాధానాలు ఇవ్వాల్సివస్తుందో ...?
నేటికి రాష్ట్రములో తెదేపా అనుసరిస్తున్న వారసత్వ కుటుంబ రాజకీయాలకు, ధన రాజకీయాలకు ఎన్ని వందల వేల తెదేపా నాయకుల కుటుంబాలు జీవశ్చవాలుగా మారాయో ...? రేపటికి వారికి ఎవరు సమాధానం చెబుతారు ?
ఇన్నాళ్ళు తెదేపాని ఒక పల్లకిగా బోయీలుగా మోస్తున్న కార్యకర్తల నాయకుల జీవితాలను పునాదిరాళ్ళుగా చేసుకుని వారికి రెండులక్షల తాయిలం / కిరాయి ఆశ చూపిస్తూ ఇంకా ఎంతమంది అవకాశవాద రాజకీయ భవంతులు నిర్మించుకుంటారో ...? ఇంకెంతమంది దళారులను, ఇన్నాళ్ళు పార్టీకి తీవ్ర ద్రోహం, కుట్ర చేసిన / చేస్తున్న వాళ్ళను చేర్చుకుంటారో , ఎంతమందికి లాభం చేకురుస్తారో ...?
రేపటి సంగతి మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకుందాం అని అనుకునే బానిస మనస్కులు, స్వార్ధపరులు, భజన సామ్రాట్టులు నేడు నిజాలు మాట్లాడినవారి మీదకు, ప్రశ్నించిన వారి మీదకు రేసు కుక్కల్లాగా వస్తారనీ తెలుసు.
చూద్దాం .. చక్రవర్తుల మహారాజులు పాలించిన నాడు భూమి గుండ్రంగానే ఉంది, నేడు అలాగే ఉంది, రేపు అలాగే ఉంటుంది. భూమి చుట్టుకొలతలలో నాటికీ నేటికీ ఏనాటికీ మార్పు ఉండదు కదా ..! చరిత్రే సాక్ష్యం, ఈ నేలలో ఎన్ని చరిత్రలు మూతపడలేదు ? రేపు ఎన్ని పడవు ?
నేడు అవుతున్నది రేపటి చరిత్ర, రేపు ఏమవుతుందో భవిష్యత్తు చరిత్ర తప్పక చెబుతుంది..
.... సశేషం ... 
సువేరా